వాదనలను ఖండించిన భారత సైన్యం.. విచారణ జరిపిస్తామని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడి సుబన్‌సిరి: అరుణాచల్ ప్రదేశ్‌లోని అప్పర్ సుబన్‌సిరి జిల్లాలో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ) సరిహద్దు దాటి చొరబడి స్థానికుల వారసత్వ భూములను ఆక్రమిస్తోందన్న ఆరోపణలు కలకలం రేపాయి. సరిహద్దు ప్రాంతంలో పనిచేస్తున్న స్థానిక సంస్థ నాహ్ వెల్ఫేర్ సొసైటీ (ఎన్‌డబ్ల్యూఎస్) చేసిన ఈ ఆరోపణల నేపథ్యంలో అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ ఆరోపణలపై వాస్తవాలను తెలుసుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర హోంమంత్రి మామా నటుంగ్ సోమవారం ప్రకటించారు. అయితే ఈ ఆరోపణలను భారత సైన్యం పూర్తిగా ఖండిస్తూ, అవి నిరాధారమైనవని స్పష్టం చేసింది. నాహ్ వెల్ఫేర్ సొసైటీ ఇటీవల జిల్లా డిప్యూటీ కమిషనర్‌కు రాసిన లేఖలో భారత్–చైనా సరిహద్దు ప్రాంతంలో చైనా సైన్యం కార్యకలాపాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. చైనా ప్రభుత్వం క్రమంగా తన సరిహద్దును విస్తరించుకుంటూ భారత భూభాగంలోని కీలక ప్రాంతాలను ఆక్రమిస్తోందని సంస్థ ఆరోపించింది. సంస్థ ప్రకారం, స్థానికుల వారసత్వ భూముల్లో చైనా సైన్యం అనేక ప్రాంతాల్లో సైనిక శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు రహదారులు, వంతెనలను కూడా నిర్మించింది. గ్రామస్తుల కథనం ప్రకారం, ప్రస్తుతం చైనా ఆక్రమిస్తున్న ప్రాంతాలు గతంలో తమ సంప్రదాయ వేట ప్రాంతాలుగా ఉండేవని, కొన్నేళ్ల క్రితం వరకు అక్కడ స్వేచ్ఛగా సంచరిస్తూ అడవుల నుంచి అటవీ ఉత్పత్తులను సేకరించేవారని తెలిపారు. అదేవిధంగా తమ పశువులు మేత మేసే ప్రాంతాలు కూడా ఇప్పుడు పూర్తిగా చైనా సైన్యం ఆధీనంలోకి వెళ్లిపోయాయని స్థానికులు ఆరోపించారు. గత 10 నుంచి 15 ఏళ్లలో సరిహద్దు ప్రాంతాల్లో చైనా ఆక్రమణ చర్యలు గణనీయంగా పెరిగాయని ఎన్‌డబ్ల్యూఎస్ పేర్కొంది. తాక్‌సింగ్ ప్రాంతంలో చైనా సైన్యం వేగంగా చేపడుతున్న కార్యకలాపాలు తమకు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని, ప్రతిరోజూ అంగుళం అంగుళంగా తమ భూమిని కోల్పోతున్నామని సంస్థ తన లేఖలో పేర్కొంది. ఈ ఆరోపణలపై స్పందించిన అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం, ముందుగా జిల్లా యంత్రాంగం నుంచి అధికారిక నివేదికను స్వీకరించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపింది. జిల్లా పరిపాలన, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు, పంచాయతీ కమిటీల నివేదికల ఆధారంగా వాస్తవాలను పరిశీలిస్తామని హోంమంత్రి మామా నటుంగ్ చెప్పారు. ప్రస్తుతం ఇవి కేవలం ఆరోపణలు మాత్రమే. నిజంగానే ఎలాంటి ఆక్రమణ జరిగి ఉంటే అది అత్యంత ఆందోళనకరమైన విషయం. వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేస్తాం అని ఆయన వెల్లడించారు. ఇదిలా ఉండగా, అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా సైన్యం చొరబడి సైనిక శిబిరాలు ఏర్పాటు చేసిందంటూ వెలువడిన మీడియా కథనాలను భారత సైన్యం సోమవారం పూర్తిగా ఖండించింది. ఆ వార్తలు అసత్యమైనవి, ఎలాంటి ఆధారాలు లేనివని స్పష్టం చేసింది. అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా పీఎల్‌ఏ ఇటీవల చొరబడి శిబిరాలు ఏర్పాటు చేసిందని కొన్ని మీడియా కథనాలు వెలువడ్డాయి. అవి పూర్తిగా తప్పుదోవ పట్టించే, నిరాధారమైన వార్తలు అని భారత సైన్యం తన ప్రకటనలో పేర్కొంది.